ముక్కు చుట్టూ సమస్యా?

0
534

కొందరికి బ్లాక్‌హెడ్స్‌ సమస్య ఉంటే.. మరికొందరిని వైట్‌హెడ్స్‌ ఇబ్బంది పెడతాయి. చర్మంపై చాలా చిన్నగా తెల్లని మచ్చల్లా కనిపిస్తుంటాయి వైట్‌హెడ్స్‌. ముక్కూ, నుదుటిపై ఎక్కువగా కనిపించే ఈ సమస్యను తగ్గించుకోవాలంటే ఏం చేయాలో తెలుసా..

* స్నానం చేసే ముందు ముఖానికి ఆవిరి పట్టాలి. ఇలా చేయడం వల్ల వైట్‌హెడ్స్‌ కాస్త బయటకు కనిపిస్తాయి. ఆ తరవాత వైట్‌హెడ్స్‌ని తొలగించడం సులువు అవుతుంది.

* రెండు చెంచాల ఓట్స్‌ పొడిలో నీళ్లు కలిపి మెత్తని ముద్దలా చేసి సమస్య ఉన్న చోట పూతలా రాయాలి. పదిహేను నిమిషాల తరవాత ఈ పూతను తీసేయాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే సమస్య అదుపులోకి వచ్చేస్తుంది.

* చెంచా వంటసోడాలో కాసిని నీళ్లు కలపాలి. దీన్ని వైట్‌హెడ్స్‌ ఉన్న చోట రాయాలి. ఆ వంటసోడా పూత ఆరిపోయాక కడిగేయాలి. ఇలా తరచూ చేస్తోంటే అధిక జిడ్డు పోవడమే కాదు, వైట్‌హెడ్స్‌ సమస్య కూడా తగ్గుతుంది.

* ఒకటిన్నర చెంచా సెనగపిండిలో ఆలివ్‌నూనె వేస్తూ ముద్దలా చేసుకోవాలి. దీన్ని వైట్‌హెడ్స్‌ ఉన్నచోట పూతలా వేసుకుని బాగా ఆరిపోయాక కడిగేయాలి. ఇది మృతచర్మాన్ని తొలగించడమే కాదు, వైట్‌హెడ్స్‌ సమస్యనూ అదుపులో ఉంచుతుంది.

* చిన్న బంగాళాదుంప ముక్కను తీసుకుని సమస్య ఉన్న చోట మర్దన చేసినట్లు రాయాలి. పది నిమిషాల తరవాత పాలల్లో దూదిని ముంచి.. తుడిచేయాలి.

* రోజులో కనీసం రెండు లీటర్ల నీటిని తాగాలి. దానివల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోయి, ఈ సమస్య తగ్గుతుంది. తీసుకునే ఆహారంలో పండ్లూ, కూరగాయలూ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.

* ముఖం ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఔషధ గుణాలున్న సబ్బు లేదా సహజసిద్ధ పదార్థాలతో తయారుచేసిన క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

NO COMMENTS