వార్థక్య ఛాయల్ని వాయిదా వేద్దాం!

0
267

ముప్ఫైఏళ్లు దాటాక ముఖంపై అక్కడక్కడా సన్నని గీతలు మొదలవుతాయి. వాటిని మరికొంతకాలం వాయిదా వేయాలంటే.. తీసుకునే ఆహారంలో కొన్నిరకాల మార్పులు చేయడం మొదలుపెట్టాలి. ఇంతకీ అవేంటంటే..

చర్మంలో వార్థక్యపు ఛాయల్ని తగ్గించాలంటే ముందుగా కొన్నిరకాల పదార్థాలను తీసుకోవడం మానేయాలి. మైదాతో చేసిన చిరుతిళ్లూ, బేకరీ పదార్థాలూ, చక్కెర లాంటివాటి వినియోగాన్ని బాగా తగ్గించాలి. చక్కెర, దాంతో చేసిన పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ముడతలు చాలా త్వరగా మొదలవుతాయి.

* పొడిబారిన చర్మం కూడా వార్థక్యపు ఛాయలు మొదలయ్యేందుకు కారణం అవుతుంది. ఆ సమస్యను నివారించాలంటే చర్మాన్ని ఎప్పుడూ తేమగా ఉంచుకోవాలి. అంటే నీళ్లు ఎక్కువగా తాగాలి. దాంతోపాటూ ఒమెగా త్రీ, సిక్స్‌ నైన్‌ ఫ్యాటీ ఆమ్లాలు ఉండే ఆహారాన్ని తినడం మొదలుపెట్టాలి. వాటి నుంచి అందే కొవ్వు శరీరాన్ని తేమగా, మృదువుగా, తాజాగా ఉంచుతుంది. ఇందుకోసం చేపలూ, వాల్‌నట్లూ, అవిసెగింజలూ, ఆలివ్‌నూనె, బాదం.. లాంటివి ఎంచుకోవాలి.

*చర్మంలో కొలాజిన్‌ బలహీనమైనప్పుడూ ముడతలు మొదలవుతాయి. ఈ సమస్య ఎదురుకాకుండా ఉండాలంటే అమినోయాసిడ్లు ఉండే ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. మాంసాహారం, చేపలూ, గుడ్లూ, టోఫు, నట్స్‌, గింజల్లాంటివి అమినోయాసిడ్లను సమృద్ధిగా అందిస్తాయి.

* ఆకుకూరలు కూడా చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉంచడంలో కీలకంగా పనిచేస్తాయి. వాటిని ఆహారంలో తీసుకోవడం మాత్రమే కాదు.. రసం రూపంలో తాగినా కూడా ఆ పోషకాలు సులువుగా అందుతాయి. అలా రసాలు తీసుకుంటున్నప్పుడు చక్కెర వినియోగాన్ని వీలైనంతవరకూ తగ్గించాలి.

* వయసుపెరిగేకొద్దీ చర్మంలోని పై పొర.. పల్చగా బలహీనంగా మారి పొడిబారుతుంది. దాంతో వార్థక్యపు ఛాయలు మొదలవుతాయి. ఈ సమస్యను అధిగమించాలంటే ఫైటోసెరామైడ్లు అనే పోషకాలు చర్మానికి అందాలి. అందుకు వీట్‌ జెర్మ్‌, బ్రౌన్‌రైస్‌, పాలకూర, బీట్‌రూట్‌ లాంటివి ఎక్కువగా తీసుకోవాలి.

* బయట ముఖ్యంగా ఎండలో ఎక్కువగా గడపడం వల్ల కూడా ఈ సమస్య కనిపిస్తుంది. ఫ్రీరాడికల్స్‌, కాలుష్యంతోపాటూ సరైన పోషకాహారం తీసుకోకపోవడం లాంటివి ఈ సమస్యను ఇంకా పెంచుతుంది. ముడతల్ని ఎదుర్కోవాలంటే టొమాటోలూ, క్యారెట్లూ, గుమ్మడి, బొప్పాయి.. లాంటివి ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది.

* మనం తీసుకునే ఆహారంలో ఉప్పు తగ్గించడం వల్ల అధికరక్తపోటు అదుపులో ఉండటమే కాదు.. చర్మానికీ మంచిది. దానివల్ల కళ్ల అడుగున నల్లని వలయాలూ, కళ్లు ఉబ్బడం.. లాంటి సమస్యలు దరిచేరవు. ఉప్పు తగ్గించడంతోపాటూ బంగాళాదుంపలూ, నట్స్‌, గింజలూ, చికెన్‌.. వంటి పొటాషియం అధికంగా ఉండే పదార్థాలనూ ఎంచుకోవాలి.

* పెరుగులో ఉండే ప్రొబయోటిక్స్‌ మంచి బ్యాక్టీరియాను శరీరానికి అందించడమే కాదు, జీర్ణసంబంధ సమస్యల్నీ నివారిస్తుంది. పెరుగుతో అది మాత్రమే కాదు, చర్మానికీ మేలు జరుగుతుంది.

NO COMMENTS